- బహిరంగ మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు
- ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమన్వయం
- ప్రాధాన్య వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు
- ధరల స్థిరీకరణ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్
ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ధరల స్థిరీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పప్పులు, బియ్యం, వంటనూనెలు, టమోటా, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్‌సేల్ ధరలపై సమీక్ష నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా వంటనూనెల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అందుబాటు ధరలు నిర్ధారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఖరీఫ్‌కు ముందస్తు ప్రణాళికలు
రాబోయే ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని మంత్రులు తెలిపారు. రైతులు ప్రాధాన్యత ఉన్న వరి రకాల సాగు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
డిమాండ్ తక్కువగా ఉన్న వరి రకాల సాగు వల్ల కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 1010, పీఆర్-126 వంటి రకాలలో అధికంగా నూక ఉత్పత్తి అవుతుండటంతో వినియోగానికి అనుకూలంగా లేక రైతులు నష్టపోతున్నారని వివరించారు.
ఈ అంశంపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ధరలను నియంత్రణలో ఉంచేందుకు అవసరమైన ముందస్తు చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎక్స్-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పౌర సరఫరాల కమిషనర్ కె. కన్నా బాబు, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ ఎస్. డిల్లీ రావు, ఆయిల్ ఫెడ్ ఎండీ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

