Gen Z యువతలో నిన్నటి నుంచీ రాజకీయంపై సరికొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. ట్రెండింగ్ రీల్స్ నుండి డైలీ అప్డేట్స్ వరకు.. రాజకీయం ఒక్కసారిగా యువత చర్చల్లోకి వచ్చేసింది. దీనికంతటికీ కారణం ఒక్కడే.. అతనే అభిజీత్ దీప్కే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’ (కాక్రోచెస్)తో పోల్చిన తర్వాత, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆన్లైన్లో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP). ఈ పార్టీకి అభిజీత్ దీప్కేనే ప్రధాన సారథి.
ఈ CJP పార్టీని ప్రారంభించిన రెండు రోజుల్లోనే 40వేల మందికి పైగా సభ్యులు ఇందులో చేరారు. అంతే కాదు, సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్‌లను కూడా ఈ పార్టీ ఇప్పటికే తమ సభ్యులుగా చేర్చుకోవడం విశేషం.
ఎవరీ అభిజీత్ దీప్కే?
అభిజీత్ దీప్కే.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు. ఆయన ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. నేరేటివ్ బిల్డింగ్, పబ్లిక్ మెసేజింగ్, డిజిటల్ ప్లాట్‌ఫాంలు రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై ఆయన ప్రధానంగా పని చేస్తుంటారు. ఆయన పూణేలో జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆయన బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.
2020 నుండి 2023 వరకు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా పని చేశారు. ఫిబ్రవరి 2020లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయినింగ్లో అభిజీత్ కీలక పాత్ర పోషించారు. ఇది పార్టీ రాజకీయ, ఆన్లైన్, యువత భాగస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ తర్వాత, 2026లో ఆయన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ప్రారంభించారు.
ఏమిటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’?
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఒక కేసు విచారణ సందర్భంగా.. వివిధ వృత్తులలో, సమాజంలో స్థానం కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువతను “బొద్దింకలు” అని సంబోధించినట్లు వచ్చిన వార్తల ఆధారంగా పార్టీకి ఈ పేరు పెట్టారు. ఆ వ్యాఖ్యలను చూసి నీరుగారి పోకుండా, దీప్కే దానిని ఒక వ్యంగ్య పొలిటికల్ గ్రూప్‌గా మార్చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న యువత దీనికి భారీగా మద్దతు ఇస్తోంది. ఈ పార్టీ వెబ్సైట్ ప్రకారం.. ఇది ‘సోమరులు, నిరుద్యోగుల గళం’. ఈ పార్టీ మేనిఫెస్టోలో ఐదు ప్రధాన వాగ్దానాలను పొందు పరిచారు.
- సీజేపీ అధికారంలోకి వస్తే, రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్‌కు కూడా బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వబడదు.
- సీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా లేదా ప్రతిపక్షాల పాలనలోనైనా.. ఏదైనా అసలైన ఓటు గనుక తొలగించబడితే, సదరు ఎన్నికల అధికారిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదం కంటే తక్కువ ఏమీ కాదు.
- మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తారు.
- ప్రభావవంతమైన వ్యాపారవేత్తల యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తారు.
- ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే.. 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధిస్తారు.
సీజేపీలో చేరడానికి అర్హతలేంటి?
- నిరుద్యోగి: బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా లేదా సిద్ధాంతపరంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి.
- సోమరిపోతు: శారీరకంగా సోమరితనంగా ఉన్నా, మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలి.
- క్రానికల్లీ ఆన్లైన్: బాత్రూమ్ బ్రేక్స్‌తో కలుపుకుని రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లో గడపాలి.
- ప్రొఫెషనల్‌గా విమర్శించగలగడం: చేసే విమర్శ పదునైనదిగా, నిజాయితీగా, సమాజానికి నిజంగా ఉపయోగపడే అంశంపై ఉండాలి.
ఈ పార్టీ ఇంకా అధికారికంగా నమోదు కానప్పటికీ, దేశ రాజకీయాలపై విరక్తి చెందిన భారతీయ యువతను చివరకు రాజకీయాల వైపు నడిపించే సాధనంగా ఇది మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు.

