ఆంధ్రా పల్స్ – విజయవాడ: నైరుతి రుతుపవనాలు-2026 అంచనాలు, ముందస్తు సన్నద్ధతపై భారత వాతావరణ శాఖ (IMD) మరియు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) సంయుక్తంగా మంగళవారం కీలక స్టేక్‌హోల్డర్స్ సమావేశాన్ని నిర్వహించాయి. గన్నవరం మండలం అడవినెక్కలలోని ఎన్ఐడిఎం సదరన్ క్యాంపస్‌లో జరిగిన ఈ సదస్సుకు IMD డైరెక్టర్ జనరల్ డా. ఎం. మహాపాత్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు హెచ్చరికలను సమర్థంగా వినియోగించి ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించాల్సిన అవసరం ఉందని డా. మహాపాత్ర తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో రుతుపవనాల రాక, తీవ్రతలో మార్పులు వస్తున్నాయని, ఒకే సీజన్లో వరదలు-కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల వల్ల ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. తూర్పు కనుమల వద్ద ‘ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్’ కారణంగా ఉత్తర ఆంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రపు పోటు పెరిగితే తీరప్రాంతాల్లో ముంపు ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
IMD అభివృద్ధి చేసిన ‘డిసిషన్ సపోర్ట్ సిస్టమ్’ ద్వారా గత, భవిష్యత్తు వర్షపాతం అంచనాలతో పాటు జిల్లా, మండలాల వారీగా ప్రభావ ఆధారిత సమాచారం అందుబాటులో ఉందన్నారు. ప్రజల కోసం ‘మౌసమ్’, ‘మౌసమ్ గ్రామ్’, రైతుల కోసం ‘క్రాప్ వెదర్’ యాప్‌లు ఉపయోగపడతాయని సూచించారు.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, జూన్‌లో మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. అయితే ఎల్ నినో ప్రభావంతో దేశ సగటు వర్షపాతం సుమారు 90 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొన్నారు.

ICAR-CRIDA విశ్రాంత ప్రొఫెసర్ డా. బి.వి. రమణరావు మాట్లాడుతూ విపత్తుల వల్ల దేశానికి భారీ నష్టం జరుగుతోందని, ముందస్తు అంచనాలతో కనీసం 10-15 శాతం నష్టం తగ్గించవచ్చన్నారు. ‘వల్నరబిలిటీ ఇండెక్స్’ రూపకల్పన అవసరమని సూచించారు.
రీజినల్ మెట్రోలాజికల్ సెంటర్ చెన్నై అధిపతి డా. డి. శివానంద దక్షిణాసియాలో 75-90 శాతం వర్షపాతం జూన్-సెప్టెంబర్ మధ్యే కురుస్తుందని, ఈ కాలంలో మార్పులు వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ‘క్లైమేట్ స్మార్ట్ స్టేట్’గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఎన్డిఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వి.వి.ఎన్. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ IMD హెచ్చరికల ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతోందన్నారు.
ఎన్ఐడిఎం జాయింట్ డైరెక్టర్ కల్నెల్ పి. శ్రీనివాసులు రెడ్డి విపత్తు ముందు సన్నద్ధతకు పెట్టే ఖర్చు, విపత్తు తర్వాత ఖర్చుతో పోలిస్తే ఎంతో తక్కువని, సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అమరావతి వాతావరణ కేంద్ర శాస్త్రవేత్త ఎస్. స్టెల్లా మాట్లాడుతూ వాతావరణ అంచనాలు వ్యవసాయం, నీటి యాజమాన్యం, ఇతర రంగాలకు కీలకమని తెలిపారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొన్నారు.

