ఆంధ్రా పల్స్ – విజయవాడ: ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి, కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులను ట్రావెల్ హిస్టరీ ఆధారంగా పరీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో ఎయిర్పోర్టు అథార్టీతో సమన్వయం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లక్షణాలు ఉన్నవారిని వెంటనే క్వారంటైన్ చేసి, వారికి దగ్గరగా ఉన్నవారికి కూడా వైద్య పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. విశాఖ ఓడరేవు అధికారులతో కూడా మాట్లాడి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
విమానాల ద్వారా కాకుండా రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారి విషయంలోనూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎబోలా పీడిత దేశాల నుంచి దేశంలోకి వచ్చే ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, అందుకు అనుగుణంగా సమాచారాన్ని రాష్ట్రాలకు పంపుతోందని చెప్పారు. కొవిడ్ సమయంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
అంతేకాక, వైద్య ఆరోగ్య శాఖలో ANM, ఆశా వర్కర్ల నుంచి ఉన్నతస్థాయి వరకు అందరినీ వర్చువల్ సమావేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాల్లోని టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నామని, ఒక్కో చోట 15 పడకల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తక్షణ అవసరాలకు సరిపడా PPE కిట్లు, వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ మేరకు కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత మూడు వారాల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, కళ్ల ఎర్రబారడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

