- డాక్టర్ పి. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అరుదైన శస్త్రచికిత్స
- లాప్రోస్కోపిక్ సర్జరీతో ప్రాణాలు కాపాడిన మాతాశ్రీ ఆసుపత్రి వైద్యులు
- రెండోసారి కూడా మింగిన మహిళా
ఆంధ్రా పల్స్ – నరసరావుపేట: పల్నాడు జిల్లా పెట్లవారిపాలెంకు చెందిన ఓ మహిళ పొత్తికడుపులోకి చేరిన పెన్నులు, చెక్క స్పూన్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా బయటకు తీశారు. నరసరావుపేటలోని మాతాశ్రీ ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పి. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది.
బాధిత మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ మాతాశ్రీ ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించగా, పొత్తికడుపులో విదేశీ వస్తువులు ఉన్నట్లు గుర్తించి విస్తుపోయారు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పెన్నులు, చెక్క స్పూన్లను మింగినట్లు గుర్తించారు.

పరిస్థితి విషమించకముందే డాక్టర్ పి. రామచంద్రారెడ్డి బృందం తక్షణమే స్పందించి, ఓపెన్ సర్జరీ అవసరం లేకుండానే అధునాతన లాప్రోస్కోపిక్ విధానం (కీహోల్ సర్జరీ) ద్వారా పొత్తికడుపులోని పెన్నులు, చెక్క స్పూన్లను తొలగించారు.
శస్త్రచికిత్స అనంతరం డాక్టర్ పి. రామచంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మతిస్థిమితం సరిగా లేని కారణంగా సదరు మహిళ గతంలోనూ ఇలాగే వస్తువులను మింగగా వైద్యులు తొలగించారని, ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇది రెండోసారని డాక్టర్ పి. రామచంద్రారెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నట్లు వెల్లడించారు.

