- మెటా, అమెజాన్, జోహోతో భాగస్వామ్యాలు
- స్టార్టప్‌లకు కియా చేయూత
- డీప్ టెక్కు రూ.20 కోట్లు
ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకుంది.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ అవుట్‌పోస్టులను ప్రారంభించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో ‘స్మార్ట్ విలేజ్’ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలుగా పనిచేయనున్నాయి.
ఆర్టీఐహెచ్తో కలిసి కియా ఇండియా అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. స్టార్టప్‌లకు హైఎండ్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ సౌకర్యాలు అందించనుంది. డీప్ టెక్ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం కోసం సిడ్బీ రూ.20 కోట్ల సీడ్ ఫండ్‌ను ప్రకటించింది.
రాష్ట్రంలోని లక్ష మంది ఎంఎస్ఎంఈల డిజిటల్ సామర్థ్యాన్ని పెంచేందుకు 50 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే వెయ్యి ఎంఎస్ఎంఈ యూనిట్లలో ఎనర్జీ, వాటర్ ఆడిట్లు నిర్వహించేందుకు ఎస్సెల్ సంస్థతో ఒప్పందం కుదిరింది. రూ.200 కోట్ల వ్యయంతో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం చేపట్టి 750 యూనిట్లకు, 3,125 మందికి ఉపాధి కల్పించనున్నారు. దివ్యాంగ యువతకు పారిశ్రామిక శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.
అంతర్జాతీయ మార్కెట్లలోకి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు
ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు పలు సంస్థలతో భాగస్వామ్యాలు కుదిరాయి. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌తో ఎగుమతుల ప్రోత్సాహానికి, ఆరామెక్స్తో లాజిస్టిక్స్ మద్దతుకు ఒప్పందాలు జరిగాయి. మెటా సంస్థ లక్ష మంది మైక్రో ఎంటర్ప్రెన్యూర్ల సామర్థ్యాలను పెంచేందుకు ముందుకొచ్చింది.
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జోహో, టెక్నాలజీ శిక్షణ కోసం వోడాఫోన్ ఐడియా బిజినెస్‌తో ఒప్పందాలు కుదిరాయి. క్యూసీఐ నాణ్యత ప్రమాణాల కోసం, పీఎఫ్ఆర్డీఏ సామాజిక భద్రత, పెన్షన్ వ్యవస్థల అమలుకు సహకారం అందించనున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డీబీవీ స్వామి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈఓతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

