ఆంధ్రా పల్స్ – అమరావతి: విమర్శలు, దుష్ప్రచారం తప్ప కొన్ని రాజకీయ పార్టీలకు మరో పని లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి, అసత్యాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియామకంలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టామని తెలిపారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కేటగిరీల ప్రకారం ఈ నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండానే కొందరు విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్మాణాత్మక నిర్ణయాన్నీ విమర్శించడం సరైంది కాదని సీఎం పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి రూ.10 కోట్లు కేటాయించడంపైనా విమర్శలు రావడం విచారకరమని అన్నారు. బాధ్యత గల రాజకీయ పార్టీలు అంశాలను అధ్యయనం చేసి మాట్లాడాలని సూచించారు.
ప్రజలకు మేలు చేసే విషయంలో పోటీ పడాలని, విభేదాలు సృష్టించడం సమాజానికి హానికరమని సీఎం చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన నేపథ్యంలో, ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని తార్కికంగా ముందుకు తీసుకెళ్లాలని, అనవసర వివాదాలు సృష్టించవద్దని సూచించారు.

