ఆంధ్రా పల్స్ – గుంటూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ సూచించారు.
కలెక్టరేట్లో నిర్వహించిన “యోగాంధ్ర-2026” సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఏడాది “Yoga for Healthy Aging” నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జూన్ 21న గుంటూరు వెస్ట్రన్ బైపాస్‌పై సుమారు 25 వేల మంది పాల్గొనేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా పట్ల ఆసక్తి ఉన్న ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జూన్ 7 నుంచి 20 వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో యోగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉండవల్లి గుహలు, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వంటి ప్రదేశాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అంతకుముందు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి వెస్ట్రన్ బైపాస్ ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

