ఆంధ్రా పల్స్ – అమరావతి: రాష్ట్రంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలోని బ్లాక్-2లో శుక్రవారం PNG గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా PNG కనెక్షన్ల పెంపు, సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై మంత్రి చర్చించారు. కనెక్షన్ల విస్తరణలో ఎదురవుతున్న అడ్డంకులు, అనుమతుల జాప్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ప్రజలకు సురక్షితమైన, అందుబాటు ధరలో గ్యాస్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా PNG వినియోగాన్ని విస్తరించేందుకు సంబంధిత సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

