ఆంధ్రా పల్స్ – విజయవాడ: న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీఐసీ) ప్రత్యేక అధికారిగా తేళ్ల కస్తూరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న కస్తూరి, ఏపీఐసీ ప్రత్యేక అధికారి పూర్తి అదనపు బాధ్యతలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తూన పి. కిరణ్ కుమార్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆ బాధ్యతలను తేళ్ల కస్తూరికి బదలాయించారు. సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి జారీ అయిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం కస్తూరి న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారి హోదాలో బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం తేళ్ల కస్తూరి, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తేళ్ల కస్తూరి సేవా ప్రస్థానం 2001 డిసెంబర్ 21న ప్రారంభమైంది. ఆ రోజున ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ)గా రంగారెడ్డి జిల్లాలో నియమితులయ్యారు. అనంతరం హైదరాబాద్ జిల్లాలో కూడా డీపీఆర్ఓగా సేవలు అందించారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన తరువాత ఉమ్మడి రాష్ట్ర పబ్లిసిటీ సెల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం తొలి మహిళా సీపీఆర్ఓ టు డీజీపీగా నియమితులై, సమర్థవంతంగా పనిచేసి గుర్తింపు పొందారు. తరువాత తొలి మహిళా సీపీఆర్ఓ టు జీహెచ్ఎంసీగా కూడా సేవలందించారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత పబ్లిసిటీ సెల్, మీడియా రిలేషన్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. 2019లో జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది, అడ్మినిస్ట్రేషన్, మీడియా రిలేషన్స్, ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుతం ఒంగోలు జోన్-3 ఆర్జేడీగా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 24 ఏళ్ల సేవా కాలంలో దాదాపు 25 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వద్ద పనిచేసి, ఉత్తమ అధికారిగా మన్ననలు పొందారు.
ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా తేళ్ల కస్తూరి నియామకంతో ఢిల్లీలోని రాష్ట్ర సమాచార కార్యాలయ పనులు సాఫీగా సాగనుందని శాఖ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ సమాచార సమన్వయం, మీడియా సంబంధాలు, అధికారిక కార్యక్రమాల నిర్వహణ వంటి కీలక బాధ్యతల్లో ఏపీఐసీ పాత్ర ముఖ్యమైనది.
ఇప్పటికే పలు విభాగాల్లో విశాల అనుభవం కలిగిన తేళ్ల కస్తూరికి ఈ అదనపు బాధ్యతలు అప్పగించడం శాఖలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె బాధ్యతలు స్వీకరించడంతో ఏపీఐసీ పనితీరులో మరింత సమన్వయం, వేగం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

