ఆంధ్రా పల్స్ – వనపర్తి: వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫైనాన్సియర్ల వేధింపులను తట్టుకోలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నర్సింహులు (40) గత ఆరేళ్లుగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలోని సల్కిలాపురం గ్రామ శివారులో 52 ఎకరాల మామిడి తోటను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో సుమారు రూ.60 లక్షల అప్పు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి ఆ అప్పు రూ.1.20 కోట్లకు చేరింది.
అప్పు భారాన్ని తగ్గించేందుకు ఊర్లోని ఇంటిపై రుణం తీసుకుని కొంత మేర చెల్లించినప్పటికీ, మిగిలిన మొత్తాన్ని తీర్చాలని ఫైనాన్సియర్లు వేధింపులకు గురి చేశారని తెలుస్తోంది. ఇంటికి నోటీసులు అంటించడం, బంగారం తీసుకెళ్లడం వంటి చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ వేధింపులపై బాధతో “నన్ను వేధించినట్లుగా మరెవరినీ వేధించొద్దు” అంటూ నర్సింహులు వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.
అనంతరం, వరుసకు అల్లుడైన వ్యక్తికి ఫోన్ చేసి తన భార్య ఎల్లమ్మ (33)ను ఉరి వేసి చంపినట్లు, పిల్లలు సాయినిహల్ (15), సాహితీశ్రీ (12)లను సంపులో పడేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు.
ఉదయం మామిడి తోటకు వెళ్లిన బంధువులు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన రైతులపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, ప్రైవేట్ ఫైనాన్సింగ్ వ్యవస్థలో ఉన్న సమస్యలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

