- 1,400 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం
- 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి
- 268 పంచాయతీల్లో ప్రత్యేక చర్యలు
- మరో 6 ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక
- డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్ర లక్ష్యం
ఆంధ్రా పల్స్ – పల్నాడు: పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి చెత్త నిర్వహణ విధానాలను సమీక్షించారు. చెత్తను పద్ధతిగా సేకరించి, విద్యుత్తుగా మారుస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలు కూడా తీర్చవచ్చని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో రోజుకు 7,200 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, కొండవీడు ప్లాంట్ 1,400 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలో కూడా ఇలాంటి ప్లాంట్ విజయవంతంగా పనిచేస్తోందన్నారు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో 268 పంచాయతీల్లో చెత్త నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నదిలోకి వ్యర్థాలు చేరకుండా కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.

రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా తీర్చిదిద్దేందుకు మరో 6 వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడలో పనులు ప్రారంభమయ్యాయని, మిగతా ప్రాంతాల్లో త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇండోర్, సింగపూర్ నగరాల చెత్త నిర్వహణ విధానాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన పెంపు అత్యవసరమని అన్నారు.


