ఆంధ్రా పల్స్ – పల్నాడు: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ దండయాన” కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసులు సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, మహిళా మరియు శిశు భద్రత విభాగం ఐజీపీ బి. రాజకుమారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం అమలవుతోంది.
మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లాలో మహిళల అవగాహన కోసం ఐదు శక్తి బృందాలను ఏర్పాటు చేసి, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, భద్రత అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లలో 2,942 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈవ్ టీజింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు సున్నిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా, ప్రత్యేక బృందాలతో విస్తృత స్థాయి పెట్రోలింగ్ కొనసాగుతోంది. మహిళలు, చిన్నారులపై కేసులను ప్రాధాన్యతతో విచారించి, నిర్దేశిత గడువులో చార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 2025 నుంచి ఐటీ సంబంధిత లైంగిక నేరాల కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్ షీట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా విచారణ వేగవంతం చేయడంతో గత రెండేళ్లలో 30 కేసుల్లో దోష నిర్ధారణ జరిగి, 15 కేసుల్లో జీవిత ఖైదు, 6 కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్షలు విధించబడ్డాయి.
“ఆపరేషన్ ట్రేస్” ద్వారా తప్పిపోయిన బాలికల గుర్తింపులో విశేష ఫలితాలు సాధించారు. జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2026 వరకు నమోదైన 191 కేసుల్లో 190 మంది బాలికలను సురక్షితంగా కుటుంబాలకు చేర్చారు. మిగిలిన ఒక కేసు విచారణలో ఉంది. ఈ ప్రక్రియలో AI ఆధారిత CCTV-360 వ్యవస్థ కీలక పాత్ర పోషించింది.
లైంగిక నేరస్తులపై 144 SOS షీట్లు నిర్వహిస్తూ, వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్, సాంకేతిక పర్యవేక్షణతో పునరావృత నేరాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు.
హింసకు గురైన మహిళలు, బాలికలకు వైద్య, న్యాయ, మానసిక, పోలీస్ సేవలు ఒకే చోట అందించేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అత్యవసర సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళా హెల్ప్‌లైన్ 181, అత్యవసర సేవలు 112 నంబర్లను వినియోగించాలని సూచించారు.
మహిళలు, చిన్నారుల భద్రతలో ప్రజల సహకారం కీలకమని, అనుమానాస్పద ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.