ఆంధ్రా పల్స్
Date of Publish : 28 May 2026, 6:19 pm Posted by : ఆంధ్రా పల్స్

పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఆంధ్రా పల్స్ – పల్నాడు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. నంద్యాల జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ క్రింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు తక్షణమే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ప్రజలందరూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ విజ్ఞప్తి చేశారు.