ఆంధ్ర పల్స్ – అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత సోమవారం వరకు కొనసాగనున్నట్లు తెలిపారు.
ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మే 22, శుక్రవారం నాటికి జిల్లాల వారీగా ఉష్ణోగ్రతల అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని అంచనా. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుంది. సుమారు 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించనుందని అధికారులు తెలిపారు.
ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి, పోలవరం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
మండలాల వారీ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని APSDMA సూచించింది.
https://apsdma.ap.gov.in/files/eab7b45263c07735612ba193f39b3834.pdf

గురువారం జిల్లాల వారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల మ్యాప్
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1,
బాపట్ల జిల్లా వేటపాలెం 47.6,
కృష్ణా జిల్లా నందివాడ 47.6,
ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు 47.4,
ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4,
ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3,
మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6,
పోలవరం జిల్లా కూనవరంలో 46.5,
నెల్లూరు జిల్లా కావలిలో 46.4,
గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.