ఆంధ్రా పల్స్
Date of Publish : 03 June 2026, 6:49 pm Posted by : ఆంధ్రా పల్స్

టూరిజం హబ్ గా పోలవరం ప్రాజెక్ట్

  •  స్పిల్ వే కు దిగువన బ్రిడ్జి నిర్మాణానికి షెడ్యూల్.
  • ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రిలకు కలుపుతూ హైవే కనెక్టివిటీ.
  • గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలి.
  • అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, డిజైనర్స్ తో సమీక్ష.
  • జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

 

ఆంధ్రా పల్స్ – అమరావతి: గోదావరి పుష్కరాలు–2027 నాటికి పోలవరం ప్రాజెక్టును టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకు అనుగుణంగా 9,900 ఎకరాల విస్తీర్ణంలో లైడార్ సర్వే పూర్తిచేసి, లేఅవుట్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

బుధవారం అమరావతి సచివాలయంలో పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ప్రాజెక్టును ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రిలతో జాతీయ రహదారుల ద్వారా అనుసంధానించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

స్పిల్‌వే దిగువన బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, అనుమతులు త్వరితగతిన పూర్తిచేసి, పనులకు ఖచ్చితమైన షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణయించిన కాలపట్టికకు అనుగుణంగా ఎటువంటి ఆలస్యం లేకుండా పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఈసిఆర్ఎఫ్ డ్యాం పనులు గ్యాప్-1లో 45 శాతం, గ్యాప్-2లో 22 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తిచేసి, అనకాపల్లి వరకు గోదావరి జలాలను తరలించనున్నట్లు చెప్పారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల టన్నెల్ కనెక్టివిటీ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈ రామచంద్రరావు, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు అంగర సతీష్ బాబు, మురళీ తదితరులు పాల్గొన్నారు.