ఆంధ్రా పల్స్
Date of Publish : 12 September 2026, 4:05 pm Posted by : ఆంధ్రా పల్స్

విశ్వ వేదికపై ‘నవ గుంటూరు’ విశ్వరూపం

  • ప్రపంచ రికార్డు నెలకొల్పిన ‘నవ గుంటూరు – గ్రీన్ గణేశ’
  • ఒకే సమయంలో 25,000 మంది విద్యార్థులతో మట్టి వినాయకుల తయారీ
  • లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో జీఎంసీకి దక్కిన స్థానం
  • భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నగర పాలక సంస్థ

​ఆంధ్రా పల్స్ – గుంటూరు: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవ గుంటూరు – గ్రీన్ గణేశ’ కార్యక్రమం సరికొత్త చరిత్ర సృష్టించింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), ప్రమాదకర రసాయన రంగుల విగ్రహాల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా నగరంలోని 55 పాఠశాలలకు చెందిన 25,000 మంది విద్యార్థులు ఒకే సమయంలో ఏకకాలంలో పర్యావరణహిత మట్టి గణపతులను తయారు చేశారు. ఈ అద్భుత ఘనతను గుర్తించిన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికారిక గుర్తింపు కల్పిస్తూ రికార్డు నమోదు చేసింది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ప్రధాన కేంద్రంగా నగరంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు ఈ మహా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

​గత రికార్డులు బద్దలు: సరికొత్త మైలురాయి, గతంలో ఒకే వేదికపై 8,750 మంది పాల్గొని నెలకొల్పిన రికార్డును గుంటూరు విద్యార్థులు సునాయాసంగా అధిగమించారు. ఏకంగా 25 వేల మందితో మట్టి ప్రతిమలను రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ ఎం.ఇలియాస్ రికార్డు సాధించినట్లు అధికారికంగా ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని (సర్టిఫికెట్) జీఎంసీ అధికారులకు అందజేశారు.

25 వేల కుటుంబాలకు పర్యావరణహిత సందేశం: జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ రాబోయే తరాల్లో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకే ఈ మహా కార్యక్రమాన్ని రూపకల్పన చేశామన్నారు. విద్యార్థులు స్వయంగా తీర్చిదిద్దిన ఈ 25,000 మట్టి విగ్రహాలు నగరంలోని 25 వేల గృహాలకు చేరుతాయని, దీని ద్వారా పీవోపీ, కెమికల్ రంగుల విగ్రహాల నుంచి ఆయా కుటుంబాలు దూరంగా ఉండేలా చైతన్యం తెస్తున్నామని వివరించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యాశాఖ, కార్పొరేషన్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రజా భాగస్వామ్యంతో విస్తృతంగా చేపడతామని స్పష్టం చేశారు.

​
విద్యార్థులే భవిష్యత్ గ్రీన్ అంబాసిడర్లు: ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ కార్పొరేషన్ చేపట్టిన వినూత్న ప్రయోగాన్ని ప్రశంసించారు. సంప్రదాయ పండుగలను ప్రకృతిని కాపాడుకుంటూ ఎలా జరుపుకోవచ్చో ఈ కార్యక్రమం నిరూపించిందన్నారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డును దక్కించుకున్న గుంటూరు నగరం, ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించడం నగరానికే గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థులంతా భవిష్యత్‌లో పర్యావరణ పరిరక్షకులుగా, ‘గ్రీన్ అంబాసిడర్లు’గా నిలుస్తారని ఆకాంక్షించారు.

ఆకట్టుకున్న ఇసుక శిల్పం, కళా ప్రదర్శనలు: ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన భారీ ఇసుక వినాయక శిల్పం, భారీ మట్టి విగ్రహం, విద్యార్థులు వేసిన పర్యావరణ చిత్రలేఖనాల ప్రదర్శన సందర్శకులను, అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరవ్యాప్తంగా పండుగ వాతావరణంలో విద్యార్థులు మట్టి విగ్రహాలు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.