ఆంధ్రా పల్స్
Date of Publish : 27 May 2026, 5:57 pm Posted by : ఆంధ్రా పల్స్

తెనాలి ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం: భద్రతా లోపాలపై మంత్రి ఆగ్రహం

ఆంధ్రా పల్స్ – తెనాలి: తెనాలి ఆటోనగర్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఘటన స్థలాన్ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్నిప్రమాదాల ప్రమాదం మరింత పెరుగుతోందని హెచ్చరించారు. వ్యాపారులు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా జ్వలనశీల పదార్థాలు, పెయింట్ థిన్నర్లు వంటి దహనశీల ద్రవాలను నియమాలకు అనుగుణంగా నిల్వ చేయాలని సూచించారు.

ఆటోనగర్‌లో సుమారు 15 వేల లీటర్ల ఫ్లామబుల్ మెటీరియల్స్ నిల్వ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. అంత భారీ స్థాయిలో నిల్వ ఉంచేందుకు అవసరమైన అనుమతులు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, ఎన్‌ఓసీలు లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

ఈ అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది గంటలపాటు కృషి చేసినట్లు తెలిపారు. ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఆటోనగర్‌లో డోర్ టు డోర్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. అక్రమంగా జ్వలనశీల పదార్థాలు నిల్వ చేస్తున్న వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్, ఎన్‌ఓసీలు తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.

ఆటోనగర్‌ను వర్క్‌షాపులు, చిన్న పరిశ్రమల కోసం మాత్రమే ఉపయోగించాలి గాని, భారీ స్థాయిలో కెమికల్స్ నిల్వ చేసే కేంద్రంగా మారకూడదని హెచ్చరించారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.