- ‘లేపాక్షి’కి సాంకేతిక హంగులు
- హస్త కళారూపాల అమ్మకాల పెంపే లక్ష్యం
- తరంగా ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థ రూపకల్పన
- రాష్ట్ర స్థాయి నుంచే లేపాక్షి షో రూమ్ ల పర్యవేక్షణ
- ఏ రోజుకారోజు స్టాక్, అమ్మకాల వివరాల నమోదు
- స్టాక్ పై ఎప్పటికప్పుడు అలెర్ట్స్
- ఇంటికే హస్త కళారూపాలు అందించేలా కళాక్షి వాట్సాప్ లింక్ రూపకల్పన
- ఏఐ టూల్ తో లింక్ లో హస్త కళల సమాచారం
- వాట్పాప్ లోనే హస్త కళలకు ఆర్డర్లు డోర్ డెలివరీ
- హస్త కళాకారులకు గౌరవ ప్రద జీవనమే లక్ష్యం : మంత్రి సవిత
ఆంధ్రా పల్స్ – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలకు నూతన ఊపిరి పోసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. లేపాక్షి షోరూమ్‌లను ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దుతూ, హస్తకళల అమ్మకాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ‘తరంగా’ అనే ఏఐ ఆధారిత రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో పాటు ‘కళాక్షి’ అనే వాట్సాప్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది.
హస్తకళలు కేవలం వస్తువులు కాదు అవి మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబమని ప్రభుత్వం భావిస్తోంది. కళాకారులకు గౌరవప్రద జీవనం కల్పించడంతో పాటు, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి.
తరంగా ద్వారా సమగ్ర పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లేపాక్షి షోరూమ్‌ల నిర్వహణను ఇకపై రాష్ట్రస్థాయి నుంచే పర్యవేక్షించనున్నారు. ‘తరంగా’ వ్యవస్థ ద్వారా రోజువారీ అమ్మకాలు, స్టాక్ వివరాలు, సిబ్బంది పనితీరు వంటి అంశాలను రియల్ టైమ్‌లో గమనించవచ్చు. ఏ ప్రాంతంలో ఏ ఉత్పత్తికి డిమాండ్ ఉందో గుర్తించి, అందుకు అనుగుణంగా సరఫరా నిర్వహణ చేపట్టనున్నారు.
స్టాక్ స్థాయిలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అలెర్ట్ వ్యవస్థను అమలు చేశారు. నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు ఎరుపు, తగ్గుముఖంలో ఉన్నప్పుడు ఆరెంజ్ అలెర్ట్స్ ద్వారా అధికారులు అప్రమత్తమవుతారు. దీంతో వినియోగదారులకు ఉత్పత్తుల లభ్యత సులభమవుతుంది.
వాట్సాప్‌లోనే ‘కళాక్షి’ సేవలు
హస్తకళలను వినియోగదారుల ఇంటి వద్దకే చేరవేయాలనే ఉద్దేశంతో ‘కళాక్షి’ అనే ఏఐ టూల్‌ను రూపొందించారు. ఈ వాట్సాప్ లింక్ ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన హస్తకళల వివరాలను తెలుగులో లేదా ఇంగ్లీష్‌లో తెలుసుకోవచ్చు.
కళాకృతుల ప్రత్యేకత, తయారీ విధానం, వాటి వెనుక ఉన్న సాంస్కృతిక నేపథ్యం, కళాకారుల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆర్డర్ ఇచ్చిన వెంటనే డోర్ డెలివరీ సదుపాయం కల్పించనున్నారు.
కళాకారుల సంక్షేమమే లక్ష్యం
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ… హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడం ద్వారా కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.
తరంగా వ్యవస్థ, కళాక్షి ప్లాట్‌ఫామ్‌లతో హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో పాటు, కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.