ఆంధ్రా పల్స్
Date of Publish : 28 May 2026, 1:38 am Posted by : ఆంధ్రా పల్స్

ప్రభుత్వ సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజలకు చేరవేస్తా

  • అదనపు సంచాలకులు (ఇంచార్జి)గా బాధ్యతలు స్వీకరించిన పోతుల కిరణ్ కుమార్

 

ఆంధ్రా పల్స్ – విజయవాడ: ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడానికి కృషి చేస్తానని అదనపు సంచాలకులు (ఇంచార్జి)గా నియమితులైన పోతుల కిరణ్ కుమార్ తెలిపారు. సమాచార శాఖలో నిర్వహించిన ప్రతి బాధ్యత తనకు కొత్త అనుభవాన్ని, విలువైన పాఠాలను నేర్పిందన్నారు.

ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. కిరణ్ కుమార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనకు అడిషనల్ డైరెక్టర్ (ఇంచార్జి)గా పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కిరణ్ కుమార్, సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేయడం ద్వారా తనకు సమృద్ధమైన అనుభవం లభించిందన్నారు. ప్రతి బాధ్యత తన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడిందని పేర్కొన్నారు. సహచర ఉద్యోగులు, అధికారుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని కృతజ్ఞతలు తెలిపారు. శాఖలో ఉద్యోగులందరినీ ఒక కుటుంబంగా భావించి, సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ బాధ్యతను మరింత అంకితభావంతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్లు ఐ. సూర్యచంద్రరావు, సీఐఈఓ ఓ. మధుసూధన, ఆర్ఐఈ డాక్టర్ టి. నాగరాజ, డిప్యూటీ డైరెక్టర్లు పి. వెంకట్రాజ్ గౌడ్, డి. రమేశ్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏఎస్ వీరభద్రరావు, కే. నారాయణరెడ్డి, పి. రాజశేఖర్, డాక్టర్ కె. తిరుపాలయ్య, ఎస్వీ మోహన్ రావు, గణాంక విభాగానికి చెందిన నాగరాజు తదితరులు పాల్గొని కిరణ్ కుమార్‌ను అభినందించారు.