ఆంధ్రా పల్స్
Date of Publish : 14 October 2026, 10:57 am Posted by : ఆంధ్రా పల్స్

హోరెత్తిన విజయవాడ ఉత్సవ 2.0

  • ఒకే వేదికపై మెరిసిన సీఎం చంద్రబాబు, విజయ్
  • తెలుగు గంగ, కృష్ణ – గోదావరి – కావేరి అనుసంధానంపై చర్చ
  • ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్
  • పున్నమి ఘాట్‌లో ఇద్దరు సీఎంలకు అభిమానులు, ప్రజల నుంచి భారీ స్పందన

 

ఆంధ్రా పల్స్ – విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి సాక్షిగా, కృష్ణా నదీ తీరంలో జరుగుతున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0‘ సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం విజయవాడలో ఆవిష్కృతమైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒకే వేదికను పంచుకున్నారు. అక్టోబర్ 13 సాయంత్రం విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు సీఎం విజయ్‌కు, చంద్రబాబు ఘన స్వాగతం పలికారు.

ఈ వేడుకలకు ముందుగా ఇరువురు ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ భేటీ సాగింది. ముఖ్యంగా, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కృష్ణా జలాల సరఫరా కొనసాగింపు, ప్రతిష్ఠాత్మకమైన గోదావరి – కృష్ణా – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించుకున్నారు.

విజయవాడ పర్యటనకు వచ్చిన తమిళనాడు సీఎం విజయ్, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు విజయ్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయ్‌కు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం చంద్రబాబు, విజయ్ ఇద్దరూ ఒకే కాన్వాయ్‌లో పున్నమి ఘాట్‌కు చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారి పొడవునా అభిమానులు, ప్రజలు వారికి నీరాజనాలు పలికారు.

కృష్ణా నదీ తీరాన పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన విజయవాడ ఉత్సవ 2.0 ప్రధాన వేదికపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశీనులై లేజర్ షోలు, ఏపీ సంప్రదాయ నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌ను సత్కరించారు. ఈ పర్యటన కేవలం సాంస్కృతిక వేడుకలకే పరిమితం కాకుండా, రెండు పొరుగు రాష్ట్రాల మధ్య సహకారానికి, జల వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వేదికపైకి రాగానే మైక్ అందుకున్న విజయ్, స్వచ్ఛమైన తెలుగులో “అందరికీ నమస్కారం మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది” అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో సభా ప్రాంగణం ఈలలు, కేరింతలతో దద్దరిల్లింది. నవరాత్రి వేడుకల పవిత్ర సమయంలో విజయవాడ రావడం, ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. విజయవాడ ఉత్సవ 2.0కి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, బెజవాడ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు, ఆతిథ్యం ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సోదరభావాన్ని గుర్తుచేశారు. చెన్నై ప్రజల తాగునీటి అవసరాలు, కృష్ణా జలాలు, భవిష్యత్ నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబుతో సానుకూలంగా చర్చించేందుకు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా ఇంతటి గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వానికి, కళాకారులకు అభినందనలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు, విజయవాడకు విచ్చేసిన మిత్రుడు విజయ్‌కు హృదయపూర్వక స్వాగతం. విజయ్ సినీ రంగం నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి రాజకీయాల్లో సాధించిన ప్రగతిని, తమిళనాడును ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య భౌగోళిక సరిహద్దులే తప్ప భావోద్వేగాలు, సాంస్కృతిక సంబంధాలు విడదీయరానివని పేర్కొన్నారు. చెన్నై ప్రజల తాగునీటి అవసరాలు, కృష్ణా జలాల సరఫరా, గోదావరి – కావేరి అనుసంధానం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ యువత శక్తి సామర్థ్యాలపై సీఎం పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్న దేశం, 2047 నాటికి ప్రపంచంలోనే ‘నెంబర్ వన్‘గా అవతరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘విజయవాడ ఉత్సవ్ 2.0‘ కేవలం వినోదం కోసమే కాకుండా, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించడానికి, పర్యాటక రంగం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఉత్సవాలు వీఐపీల కోసం కాదని, సామాన్య భక్తుల పండుగలా ఘనంగా జరగాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆహ్వానాన్ని మన్నించి విజయవాడ వేడుకలకు హాజరైన సీఎం విజయ్‌కు, ఉత్సవాలను విజయవంతం చేస్తున్న కళాకారులకు, బెజవాడ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.