- పిడుగురాళ్లలో ఎంప్లాయీస్ ట్రైన్‌కు స్టాపేజ్ ఆమోదం

పల్నాడు జిల్లాకు కీలక రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796/12795) రైలుకు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్ ఇవ్వడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో హైదరాబాద్, విజయవాడ ప్రయాణాలకు సరైన రైళ్లు లేక పల్నాడు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఎంపీ ఈ సమస్యను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే స్టాపేజ్‌కు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రయాణికులకు ఉపశమనం
పిడుగురాళ్లలో ఈ ‘ఎంప్లాయీస్ ట్రైన్’ ఆగడం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద ఎత్తున లాభపడనున్నారు. రోజువారీ ప్రయాణం సులభమవడంతో పాటు, పల్నాడు ప్రాంత ప్రజలకు దీర్ఘకాలంగా ఉన్న రవాణా సమస్యకు పరిష్కారం లభించనుంది.
త్వరలోనే స్టాపేజ్ అమలు తేదీ, సమయాలపై రైల్వే శాఖ అధికారిక ప్రకటన వెలువడనుందని ఎంపీ తెలిపారు.
రైలు సమయాలు
12796 లింగంపల్లి–విజయవాడ ఇంటర్‌సిటీ: ఉదయం 04:40కి లింగంపల్లిలో బయలుదేరి, సికింద్రాబాద్ (05:20) మీదుగా 10:35కి విజయవాడ చేరుకుంటుంది.
12795 విజయవాడ–లింగంపల్లి ఇంటర్‌సిటీ: సాయంత్రం 05:30కి విజయవాడ నుంచి బయలుదేరి, రాత్రి 11:35కి లింగంపల్లి చేరుకుంటుంది.