ఆంధ్రా పల్స్
Date of Publish : 22 May 2026, 7:16 pm Posted by : ఆంధ్రా పల్స్

పగలు ఇంజనీర్.. రాత్రి రైళ్లలో చోర్

  • రైల్వే ఉద్యోగి అరెస్ట్ 
  • కర్నూలులో సంచలనం

ఆంధ్రా పల్స్ – కర్నూలు:  కర్నూలు జిల్లాలో రైల్వే శాఖకు చెందిన జూనియర్ ఇంజనీర్ ఒకరు రాత్రివేళల్లో రైళ్లలో ప్రయాణికుల లగేజీ దొంగతనం చేస్తూ పట్టుబడిన ఘటన సంచలనం రేపింది.

అనంతపురం జిల్లా యడికి మండలానికి చెందిన పి. బాలరాజు 2013లో రైల్వేలో ఉద్యోగం ప్రారంభించి, 2023లో జూనియర్ ఇంజనీర్‌గా ప్రమోషన్ పొందాడు. గత రెండేళ్లుగా అదోని రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ, అదే సమయంలో రాత్రివేళల్లో రైళ్లలో ప్రయాణికుల బ్యాగులు దొంగతనం చేస్తూ వచ్చాడని పోలీసులు వెల్లడించారు.

మే 14న నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ఆర్మీ అధికారికి చెందిన బ్యాగు దొంగతనం జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలరాజును గుర్తించి కర్నూలులో అరెస్టు చేశారు.

అతని వద్ద నుంచి సుమారు 198.5 గ్రాముల బంగారు నగలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల, కర్నూలు ప్రాంతాల్లో కలిపి మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

దొంగిలించిన బంగారు నగలు, ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించి సొమ్ము చేసుకునేవాడని విచారణలో బయటపడింది. రైల్వే ఉద్యోగిగా ఉన్న బాధ్యతను దుర్వినియోగం చేయడంతో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.