ఆంధ్రా పల్స్
Date of Publish : 15 July 2026, 11:57 pm Posted by : ఆంధ్రా పల్స్

ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ

  • ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం
  • ఆటో డిజిటలైజేషన్‌తో మహిళలకు మరింత భద్రత
  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డ్రైవర్ వివరాలు చేతిలోకి
  • 311 మంది ఆటో డ్రైవర్లకు క్యూఆర్ స్టిక్కర్ల పంపిణీ
  • ప్రజల రక్షణే లక్ష్యంగా వినూత్న కమ్యూనికేషన్ వ్యవస్థ

ఆంధ్రా పల్స్ – మంగళగిరి: ప్రయాణికుల భద్రత, రక్షణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో గుంటూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ‘ఆటో డిజిటలైజేషన్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద 311 మంది ఆటో డ్రైవర్లకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పంపిణీ చేసినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు, సూచనల మేరకు స్థానిక ఆటో డ్రైవర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆటోలో ప్రయాణికులు కూర్చునే సీటు సమీపంలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డ్రైవర్ పేరు, వాహనం నంబర్, ఫోన్ నంబర్‌తో పాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చని డీఎస్పీ తెలిపారు. అలాగే ఆటోలో వస్తువులు మరిచిపోయిన సందర్భాల్లో వాటిని సులభంగా తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థలో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు తమ లైవ్ లొకేషన్‌తో పాటు ఆటో వివరాలను వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులకు పంపించవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరడంతో పాటు, సమీప పోలీస్ స్టేషన్‌కు ఆటోమేటిక్‌గా ఫిర్యాదు వెళ్లే విధంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. శేఖర్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి పెంచల రెడ్డి ఆధ్వర్యంలో ఈ నూతన కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించినట్లు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ ప్రయాణ సమయంలో ఈ డిజిటల్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరి గ్రామీణ సిఐలు అవ్వారు బ్రహ్మం, చిరుమామిళ్ల వెంకట్, పట్టణ సీఐ వీరాస్వామి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.